Tuesday 12 December 2023

 విశాఖ మ్యూజిక్ అకాడమి

విశాఖపట్నం

54వ వార్షిక సంగీతనృత్యోత్సవాలు


విశాఖ మ్యూజిక్ అకాడమి స్థానిక కళాభారతి (ఏ.సి) ఆడిటోరియంలో 25.11.2023 నుండి 30.11.2023 వరకు ఆరురోజులపాటు తన 54వ వార్షిక సంగీతనృత్యోత్సవాలను ఘనంగా ఎప్పటిలాగే జరుపుకుంది. 

25.11.23 నాడు అనగా మొదటిరోజున వేడుకలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా ఘనసేవలందించిన జస్టిస్ D.V.S.S. సోమయాజులుగారు జ్యోతిప్రకాశనం చేస్తూ ప్రారంభించారు. కుమారి Y. కనిష్క భక్తిప్రపత్తులతో గానంచేసిన  గణపతి ప్రార్థన అనంతరం, అకాడమీ అధ్యక్షుల స్వాగతవచనాల తరువాత, ముఖ్యఅతిథి సోమయాజులుగారు తమసందేశంలో విశాఖ మ్యూజిక్ అకాడమీ విశాఖలో గత 54సం.గా అందిస్తూన్న సేవలను కొనియాడారు. ఇంత సుదీర్ఘప్రయాణంలో తమసేవలనందించిన కార్యవర్గాన్ని అభినందిస్తూ, యికముందు తానుకూడా యితోధికంగా అకాడమి కార్యక్రమాలలో పాల్గొంటానని తెలిపారు. 

సభానంతరం చెన్నయికి చెందిన శ్రీ సాకేతరామన్ గారి గాత్రసంగీతసభ వీనులవిందుగా జరిగింది. ఆనాటి కార్యక్రమానికి ప్రాయోజకతనందించిన శ్రీమతి టేకుమళ్ళ శ్యామలా సీతారామస్వామిగారు వేదికపై కళాకారులకు ఫలప్రదానం చేసి సత్కరించారు.


పంతువరాళిరాగంలో "సుందరతరదేహం" అంటూ సభను ఆరంభించి వరుసగా ఆనందభైరవి రాగంలో "నీకే తెలియకపోతే", అమృతవర్షిణిరాగంలో "ఆనందామృతకర్షిణి", బిలహరి రాగంలో చౌకకాలంలో నడచే "దొరకునా యిటువంటిసేవ", అరుదుగా వినే పశుపతిప్రియ రాగంలో "శరవణభవ", కీర్తనల అనంతరం "అంతర్యామీ అలసితి", "ఆకటివేళల" అన్న అన్నమయ్య రచనలతో కచేరీని ముగించేలోపు, శ్రోతల కోరికపై "అభోగి - వలజి" రాగాలలో పసందైన రాగం-తానం-పల్లవిని సుమారు అరగంటసేపు ఆలపించి శ్రోతలను రంజింపజేయడం విశేషం. 

స్వల్పకాలమైనా శ్రీ సాకేతరామన్ అందించిన రాగాలాపనలు స్వరకల్పనలు తన విద్వత్తును తెలియజేసేరీతిలో నడచి మనోరంజకములైనాయి.

అపారమైన అనుభవంగలిగిన వాయులీన విద్వాంసులు శ్రీ  M.S.N. మూర్తిగారు మృదంగంపై డా.వంకాయల వేంకటరమణమూర్తిగారు సమయోచితంగా అందించిన సహకారం ప్రేక్షకుల మన్ననలనందుకుంది. ముఖ్యంగా మూర్తిగారి రాగాలాపనలలో, స్వరకల్పనలలో ఆయనచూపిన వైదుష్యం గొప్పది. అలాగే ఘటంపై సహకరించిన శ్రీ M.హరిబాబుగారితో కలసి రమణమూర్తిగారు వెలయించిన లయవిన్యాసం కరతాళధ్వనులనందుకుంది. 


అకాడమి ప్రతివార్షికోత్సవ వేడుకలలో వీలైనంతవరకూ సంగీత విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేలక్ష్యంతో, ఒక సోదాహరణ ప్రసంగాన్ని యేర్పాటుచేసే ప్రయత్నం చేస్తూవస్తోంది. ఈ వేడుకలలో తెలుగువారికి ఆకాశవాణిద్వారా, తమ సంగీతసాహిత్య రచనలద్వారా సుపరిచితులైన గతశతాబ్దపు వాగ్గేయకారులు కీ.శే. బాలాంత్రపు రజనీకాంతరావుగారి రచనలపై ఒక విహంగవీక్షణంగా సోదాహరణప్రసంగాన్ని యేర్పాటుచేసింది. రెండవరోజు 26.11.23 ఆదివారం ఉదయం 10.గం.కు, శంకరమఠం ప్రాంగణంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది అకాడమీ.

"మధురయామినీ మానసవీధిలో- రజని సంగీతసాహిత్య ఈషద్దర్శనం" అన్న శీర్షికతోనే ఆకట్టుకున్న ఈ సోదాహరణ ప్రసంగాన్ని, రజనీకాంతరావుగారి సోదరులైన బాలాంత్రపు నళినీకాంతరావుగారి కుమార్తె శ్రీమతి శ్రీమతి రాంనాథ్ మరియు మనుమరాలు కుమారి శ్రేయరాంనాథ్ ఒకరు ప్రసంగిచంగా మరొకరు గానంచేస్తూ, శ్రోతలను మైమరపింపజేశారు.


"తెలుగుబాలలపల్కు తేనెసోనలచిన్కు" అంటూ గరికిపాటివారు రచించిన సరస్వతీప్రార్థన అనంతరం శ్రీ వియెస్సెన్మూర్తి రజనీకాంతరావుగారి సంగీతసాహిత్య వైదుష్యాన్ని శ్రోతలకు విపులంగా పరిచయంచేస్తూ, వారు ఒకవాగ్గేయకారునిగా రచించిన "ఆంధ్రవాగ్గేయకారచరిత్ర" గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం, వారి రచనలను డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, వోలేటి వేంకటేశ్వరులు, శ్రీరంగం గోపాలరత్నం, ఘంటసాల, సాలురు రాజేశ్వరరావు వంటి విద్వాంసులు ఆకాశవాణిద్వారా వినిపించడం, వారిరచన "కొండనుంచి కడలిదాకా" అన్న బాలల అంశానికి జపాన్ రేడియోనుంచి బహుమతినందుకోవడం, వంటి విశేషాంశాలను తెలియజేశారు.


తరువాత ప్రసంగాన్ని శ్రీమతిగారు ఆరంభించి సాహిత్యాంశాలను వివరిస్తూండగా, కుమారి శ్రేయ తనగానంతో అలరింపజేసింది.

"మనసౌనే ఓరాధా" అన్న అలనాటి ఆకాశవాణి గీతాన్ని వీనులవిందుగా కుమారి శ్రేయ ఆలపించాక శ్రోతలు ఈలోకం మరచిపోయారన్నది వారి నిశ్శబ్దమే తెలియజేసింది. "చల్లగాలిలో యమునాతటిపై" అంటూ శ్రేయ పాటనెత్తుకోగానే అందరికీ స్వరరాజేస్వరరావు తలపుకొచ్చారంటే ఆశ్చర్యంలేదు. సాహిత్య విశేషాలను పదప్రయోగప్రయోజనాన్నీ, శ్రీమతి గారు విశ్లేషించడం వలన రజనిగారి విశ్వరూపం చూపించే ప్రయత్నం జరిగింది. 

"ఎక్లాచలో ఎక్లాచలో రే" అన్న బంగాలీ గీతానికి రజనిగారందించిన "కేకవిని ఎవరూరాకపోయినా ఒక్కడివె పదవోయ్" అన్న అనువాదరచన కరతాళధ్వనులనందుకుంది. బాలమురళీకృష్ణ, శ్రీరంగం గోపాలరత్నం అలనాడు ఆకాశవాణిలో గానంచేసిన "మనప్రేమ" అన్న రజని సాహిత్యాన్ని, శ్రేయ హాయిగా వినిపించారు. "ఆశా నాప్రాణసఖీ!" అంటూ వినిపించినగీతం సహకారవాద్యాలు లేనిదే పాడడం కష్టమే అయినా అలవోకగాపాడడం గాయని సాధనను తెలియజేసింది. రజనిసాహిత్యంపై విశ్లేషణ సాహితీప్రియులు వినితీరవలసినదే. రెండుగంటలకాలం తెలియకుండా గడచిపోయిందంటే అతిశయోక్తికాదు. కార్యక్రమం ముగిశాక అకాడమీ అధ్యక్షులు శ్రీ యస్వీరంగరాజన్, ఉపాధ్యక్షులు శ్రీ బి.ఎ. రాజారావు, డా. పేరాల బాలమురళీకృష్ణ, కార్యదర్శి శ్రీ యెమ్మెస్ శ్రీనివాస్ గారలు శ్రీమతి శ్రీమతి గారిని కుమారి శ్రేయను శాలువ, జ్ఞాపిక, ఫలములను అందించి సత్కరించారు. కార్యక్రమానికి బాలాంత్రపు రజనీకాంతరావుగారి కోడలు శ్రీమతి ప్రసూనగారు విజయవాడనుంచి విచ్చేసి పాల్గొనడం చెప్పుకోదగినది.


రెండవరోజు 26.11.23 నాటి సాయంత్రం అకాడమీ జుగల్బందీ వాద్యసభను వీణ-వేణు వాద్యకళాకారులచే వైవిధ్యమైన రీతిలో ఏర్పాటుచేసింది. "చెట్టుమీదకాయ - సముద్రంలోనుండే ఉప్పు"కలసి అద్భుతరుచినందించే రీతిలో, చెన్నయికు చెందిన వీణావిదుషి శ్రీమతి నిర్మలా రాజశేఖర్, మరియు ఢిల్లీకిచెందిన  మురళీవాదనాచతురులు శ్రీ చేతన్ జోషి కలసి ఆనాటి ప్రేక్షకులకు వినూత్నమైన ఆనందాన్నందించారు. 

వీరిరువురి జుగల్బందీవాదనం "సంగీతానికి ప్రాంతీయభాషా భేదాలు లేవ"న్న సత్యాన్ని మరొకమారు స్పష్టంగా తెలియజేసింది. "గణేశవందన"ను మూడురాగాలలో అనగా, నాటరాగంలో "మహాగణపతిం", షణ్ముఖప్రియరాగంలో "సిద్ధివినాయకం", హంసధ్వని రాగంలో "వాతాపి" కీర్తనలను వరుసగా వినిపించడం శ్రోతలకు వింత అనుభూతినిచ్చింది. మురళిపై త్రిస్థాయికిమించి మూడున్నర స్థాయిలను మురళి మార్చకుండా వినిపించడం శ్రీ చేతన్ జోషి ప్రత్యేకతగా క(వి)నిపించింది. తరువాత వినిపించిన "వాచస్పతిరాగ అంశం" ఇటు కర్ణాటకరీతిలో అటు హిందుస్తానీ రీతిలో కూడా వీనులకు విందయింది. శ్రోతలకోరికను మన్నించి యిరువురూ "ద్విజావంతి" రాగాలాపనతో "అఖిలాండేశ్వరి" కీర్తనను మనోహరమైన రీతిలో వినిపించిన అనంతరం అందరికీ పరిచయమైన "పాయోజీమైనే" భజన్ మధురంగా అందించారు. "ఠుమక్ చలత్ రామచంద్ర" అన్న భజన్ తరువాత రామదాసు రచన "యేతీరుగనను దయచూచెదవో" అంటూ, సభను ముగించారు కళాకారులు. లయవిభాగాన్ని పోషించిన శ్రీ తంజావూరు మురుగభూపతి మృదంగంపైన, శ్రీ డి. చంద్రజిత్ తబలాపైనా సరియైన అవగాహనతో సందర్భోచితమైన ప్రవేశంతో శ్రోతలను ఆకట్టుకున్నారు. ఇరువురూ అందించిన పదినిముషాల లయవిన్యాసంకూడా ప్రత్యేకతను సంతరించుకుంది.


కార్యక్రమారంభంలో, అకాడమీ పూర్వకోశాధికారి స్వర్గీయ పి. రామారావుగారి స్మృతిలో ఆయన సతీమణి శ్రీమతి పి.వి. రాజ్యలక్ష్మిగారు కార్యక్రమ సహప్రాయోజకులుగా కళాకారులకు ఫలప్రదానం చేస్తూ సత్కరించారు. అకాడమీ శ్రీమతి రాజ్యలక్ష్మిగారికి ధన్యవాదాలు తెలియజేసింది.


విశాఖ మ్యూజిక్ అకాడమీ ప్రతిష్ఠాత్మక "సంగీతకళాసాగర" బిరుదు ఈ వార్షికోత్సవాలలో విశాఖకు చెందిన ప్రసిద్ధ గాత్రవిద్వన్మణి శ్రీమతి ముట్నూరి జలజాక్షిగారికి మూడవరోజు సంగీతకార్యక్రమారంభంలో 27.11.23 నాటిసాయంత్రం అకాడమీ సమర్పించింది. సభలో ప్రత్యేక ఆసనాన్ని గ్రహించిన శ్రీమతి జలజాక్షిగారికి మహిళామణులు శ్రీమతి పద్మినీ శ్రీరంగం, శ్రీమతి M.K.సునీత, మరియు శ్రీమతి మాల్యాల సుభద్రగారలు చందనలేపనంతో పుష్పమాలాంకృతురాలిని చేయగా,  వేదికపైనున్న పెద్దలు జలజాక్షిగారికి చందనమాల, శాలువ, జ్ఞాపిక ప్రఖ్యాపనపత్రము సమర్పించగా, బంగారుపతకాన్ని అకాడమీ అధ్యక్షులు శ్రీ యస్వీ రంగరాజన్ గారు సమర్పించారు. తదుపరి నగరంలో సంగీతజ్ఞులు, రసికులు, శిష్యులు, అభిమానులు ఆమెను అభినందనలతో ముంచెత్తారు. 

తరువాత జరిగిన, "సంగీతకళాసాగర" ముట్నూరి జలజాక్షిగారి గాత్రసంగీతసభలో గాయని, విశాఖ రసజ్ఞులకు శాస్త్రీయమైన, సుశిక్షితమైన, విద్యార్థులకు శిక్షణగా ఉపయోగకరమైన సంగీతాంశాలను రెండుగంటలపాటు వినిపించి ప్రశంసలనందుకున్నారు. సురటి రాగవర్ణంతో మొదలుపెట్టి, కల్యాణిరాగంలో "ఈశపాహిమాం", బేగడరాగంలో "గట్టిగాను నను చేబట్టి", ముఖారిరాగంలో "ఏమని నే", కుంతలవరాళి రాగంలో "భోగీంద్రశాయినం" అన్న కీర్తనల అనంతరం ముఖ్యాంశంగా కాంభోజిరాగంలో "శ్రీ రఘువర అప్రమేయ" అన్న అంశాన్ని రాగాలాపన, నెరవల్, స్వరకల్పనలతో విద్వత్తును ప్రదర్శిస్తూ ప్రేక్షకుల కరతాళధ్వనులందుకున్నారు. శుద్ధధన్యాసి రాగంలో "నారాయణా" అన్న భజన వినిపించి ఝంఝూటిరాగ తిల్లానాతో సభను సుసంపన్నం కావించారు జలజాక్షిగారు. శ్రీమతి లావణ్య రూపాకుల గాత్రసహకారాన్ని అందిస్తూ, సమయానుసారం తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ సభను రక్తికట్టించారు.

సుపుత్రుడు, వాయులీన విద్వాంసుడు శ్రీ ముట్నూరి శ్రీనివాస నరసింహమూర్తి వాయులీన సహకారం అందిస్తూ, గోవత్సన్యాయంగా తల్లిని అనుసరిస్తూ, తనవంతుగా తనప్రతిభను కనపరుస్తూ సభను రక్తికట్టించారు. మృదంగంపై శ్రీ కె. సద్గురుచరణ్ ఘటంపై శ్రీ యస్. హనుమంతరావు మంచి సహకారం అందించడమేకాక లయవిన్యాసంలో తమతమ ప్రతిభను కనపరచి రసవత్తరంగా నడిపించారు.


నాలుగవరోజున అనగా 28.11.23 నాటి సాయంత్రం చెన్నయినుండి వచ్చిన మాండలిన్ విద్వాంసుడు శ్రీ యు.రాజేశ్ మాండలీన్ వాద్యసభ రసికజనరంజకంగా సాగింది. ముందుగా ఆనాటి సహప్రాయోజకులైన "సెల్ పాయింట్ (ఇండియా) లిమిటెడ్" తరపున శ్రీ మోహన్ ప్రసాద్ పాండే గారు కళాకారులను ఫలప్రదానంతో సత్కరించారు. అకాడమీ వారికి ధన్యవాదాల నందజేసింది.

బృందమంతా మద్రాసువారే కావడంతో ఒకరితో ఒకరికి చక్కనైన అనుసంధానముతో సభను ఆదినుంచి అంతంవరకూ ఒకవిధమైన వేగంతో నడిపించారనే చెప్పాలి. రాజేశ్ మధ్యమధ్యలో శ్రోతల అభిప్రాయం కోరడం, ప్రక్కవాద్య కళాకారులను ప్రోత్సహించడం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

రెండున్నరగంటల కాలంలో ఒక డజను అంశాలను వినిపించి శ్రోతలను తనతోపాటు సుమారుగా పరుగెత్తించారు.

తోడిరాగవర్ణం, హంసధ్వనిలో "వాతాపి", శ్రీరంజనిలో "మారుబల్క", బిందుమాలినిలో "ఎంతముద్దో", గౌడమల్హార్ లో "సారసముఖి", చలనాటలో "ఏదయ్యాగతి", అభేరిలో "నగుమోము", కల్యాణిలో "ఏతావునరా", కాపీలో "జగదోద్ధారణ", కదనకుతూహలంలో "రఘువంశ", ఆనందభైరవిలో "పలుకేబంగారమాయెనా", సింధుభైరవిలో "వెంకటాచలనిలయం", అంశాలను వరుసగా వినిపించి చివరిలో గాంగేయభూషణి రాగంలో "ఎవ్వరే నీసరి" కీర్తన వినిపించడం విశేషం. వాయులీనంపై అనుభవజ్ఞులు శ్రీ వి.వి. శ్రీనివాసరావుగారు మాండలీన్ వాద్యానికీ దీటుగా సహకారమందించగా, మృదంగంపై డా. పత్రిసతీశ్ కుమార్ మృదంగవాద్య ప్రియులను మైకంలో పడవేశారు తన మృదంగవాదనాపటిమతో. డా. కార్తీక్ ఘటవాద్య సహకారం ఉపపక్కవాద్యమైనా పక్కవాద్యంతో పోటీగా వినిపించిన విన్యాసాలు అద్భుతం. వీరిరువురి లయవిన్యాస ప్రదర్శనతో కళాభారతి దద్దరిల్లిపోయింది.


అయిదవరోజు అనగా 29.11.23 నాటి సాయంత్రం  సరిగ్గా 6.30 గం కు ఆరంభమైన చెన్నయికు చెందిన శ్రీమతి అమృతావెంకటేశ్ గారి గాత్రసంగీతసభ ఆసాంతం ఆపాతమధురంగా సాగింది. మంగళంపల్లి బాలమురళీకృష్ణగారు రచించిన గంభీరనాట పదవర్ణం "అమ్మా ఆనందదాయిని" అంటూ గంభీరంగా ఆరంభించిన గాయని చివరివరకూ శ్రోతలను ఆనందసాగరంలో ముంచెత్తారు. బేగడ రాగంలో "శంకరినీవే", వసంతరాగంలో "వాడేవెంకటాద్రి" అన్న అన్నమయ్యరచన, లతాంగి రాగంలో "మరివేరెదిక్కెవరు", అన్న కీర్తనలను సుమధురమనోహరంగా ఆలపించి ముఖ్యాంశంగా ఖరహరప్రియ రాగంలో "ప్రక్కలనిలబడి" కీర్తనను తనదైన శైలిలో రాగాలాపన, నెరవల్,స్వరకల్పనలతో శ్రోతలను మైమరపింపజేశారు. 

లయవిన్యాసం తరువాత గానంచేసిన "బేహాగ్" రాగంలో రామదాసు రచన "హరిహరి రామనామ నన్నరమరసేయకు", సింధుభైరవి రాగంలో "విశ్వేశ్వర దర్శన్ కర్" భజన, యమన్ కల్యాణ్ రాగంలో పురందరదాసపదం "కొలలనూదుత బంద", అన్న అంశాలు అలవోకగా వినిపించిన శ్రీమతి అమృత వెంకటేశ్ బాలమురళి రచించిన ద్విజావంతిరాగ తిల్లానాతోనే ముగించడం విశేషం.

శ్రీ L. రామకృష్ణన్ వాయులీన సహకారం గానానికి మరింత మాధుర్యం చేకూర్చగా, శ్రీ S.J.అర్జున్ గణేశ్ మృదంగ సహకారమూ, లయవిన్యాసము శ్రోతల మనసులో నిలచిపోయేరీతిలో మంచి గతులతో సంగతులతో ముక్తాయిలతో అలరించింది. 

అకాడమీ వార్షికోత్సవాలలో సంగీతసభలకు మంచి ముగింపును చేకూర్చి మరునాటి నృత్యకార్యక్రమానికి తెరతీసింది.


చివరిరోజైన 30.11.23 నాటి సాయంత్రం ప్రొ. జొన్నలగడ్డ అనురాధ గారి రూపకల్పన, నృత్యదర్శకత్వంలో "ఆర్ట్ ఇండియా ఫౌండేషన్ హైదరాబాదు" వారు అందించిన నృత్యాంశాలు ప్రేక్షకుల హృదయాలలో నయనానందకరంగా నిలచిపోయాయి. 

ఈ అంశం ఆరంభమవడానికి ముందుగా అకాడమీ ప్రతియేటా సంగీతకళాకారులకు అందించే బహుమతులను ఆనాటి విశిష్ట అతిథి కవి, పండితులు, శతావధాని శ్రీ బేతవోలు రామబ్రహ్మంగారు మరియు ఆనాటి కార్యక్రమ ప్రాయోజకులు, శ్రీప్రకాష్ విద్యానికేతన్ సంచాలకులు, శ్రీ వాసుప్రకాశ్ చిట్టూరి వారి హస్తాలమీదుగా అందీయడం జరిగింది. 

ఆ సందర్భంగా సభను నిర్వహించిన శ్రీ వి.యస్.మూర్తి గారి స్వాగతవచనాలు, అతిథుల పరిచయాల అనంతరం అకాడమి ఒకముఖ్యమైన కార్యక్రమం నిర్వహించింది. వార్షికోత్సవ వేడుకలలో ప్రతియేటా నిరంతర నిస్వార్థ సేవలందిస్తూన్న కార్యవర్గ సభ్యులలో ఒకరికి కృతజ్ఞతాసూచకంగా చిరు సన్మానం చేయడం తనబాధ్యతగా అకాడమీ భావిస్తూవస్తోంది. ఈ యేడాది తమ అధ్యక్షస్థానంలో ఎనలేని సేవలనందించిన శ్రీ యస్వీ రంగరాజన్ గారిని సన్మానించుకోవాలని అకాడమి నిర్ణయించింది. రంగరాజన్ గారిని ప్రేక్షకులకు అతిథులకు గౌరవసూచకంగా పరిచయం చేస్తూ శ్రీ వి.యస్.యన్.మూర్తి, అధ్యక్షస్థానం రంగరాజన్ చేబట్టాక అకాడమీ సాధించిన పురోభివృద్ధి గురించి, రంగరాజన్ అకాడమీని నడిపించిన తీరుగురించి, అంతేకాక వృత్తిరీత్యా NSTL Director హోదాలో ఆయన సాధించిన ప్రగతిగురించి వివరంగా తెలియజేశారు.


తరువాత ప్రత్యేక ఆసనంపై ఆశీనులైన రంగరాజన్ గారిని, విశిష్ట అతిథి శ్రీ బేతవోలు రామబ్రహ్మంగారు శాలువతో సత్కరించిన పిదప, శ్రీ బి.ఎ.రాజారావుగారు పూలమాలను, డా.పేరాల బాలమురశీకృష్ణ గులాబీపూలగుచ్ఛాన్ని అందించిన తరువాత, ముఖ్య అతిథి శ్రీ వాసుప్రకాశ్ జ్ఞాపికను సమర్పించారు. గౌరవసూచకంగా అకాడమీ కార్యవర్గ సభ్యులందరూ తమ అభిమానాన్ని గులాబీలద్వారా తెలియజేయడం విశేషం. శ్రీ రంగరాజన్ తనస్పందనను తెలియజేసినతరువాత అకాడమీ ప్రతీయేటా సమర్పిస్తూన్న "Artist of distinction" అవార్డును ప్రత్యేక ఆసనం స్వీకరించిన కుమారి కొమ్మాజోస్యుల ఆలేఖ (ప్రఖ్యాత మార్దంగికులు శ్రీ కె. సద్గురుచరణ్ సుపుత్రిక) కు ప్రోత్సాహసూచకంగా అందించింది. ఈ అవార్డురూపంలో శాలువ, జ్ఞాపిక, ఫలములు మరియు పదివేలరూపాయల నగదును అకాడమీ సమర్పించింది. ఈ అవార్డుకు ప్రాయోజకతను చేకూర్చిన శ్రీ చిట్టూరి వేణుగోపాల శర్మగారి మనుమరాలు శ్రీమతి సత్యవతి, ఆమెభర్త డా. కనుపర్తి సత్యనారాయణమూర్తి గారిద్వారా నగదు బహుమతిని అందజేయడం జరిగింది. వీరికి అకాడమీ ధన్యవాదాలు తెలుపుకుంటోంది. తదుపరి అకాడమీ నిర్వహించిన యువకళాకారుల సంగీతసభలలో ఉత్తమసభను అందించిన కుమారి కె. నాగవైష్ణవికి ఫలములను, జ్ఞాపికను నగదు బహుమతిని అందజేసింది అకాడమీ. అలాగే ఆ సభలలో పాల్గొని రసజ్ఞులను ఆనందపరచిన కుమారి భమిడిపాటి వీణాధరి, కుమారి యివటూరి కృష్ణశృతి, శ్రీ అనుజ్ కాజ, శ్రీ PVS బాలాజీ యువరాజ్, శ్రీ సాయి కేశవ్ సబేశన్ గారలకు ఫలములు, జ్ఞాపిక మరియు నగదు బహుమతులను అందించి ప్రోత్సహించింది అకాడమీ. ఈ బహుమతులకు ప్రాయోజకతను చేకూర్చిన శ్రీమతి Y.V.M. జయశ్రీగారికి, ములుకుట్ల కుటుంబ సభ్యులకు, శ్రీ Ch. దుర్గాప్రసాద్ గారికీ అకాడమీ ధన్యవాదాలు తెలియజేసుకుంటోంది. 

విశిష్ట అతిథి శ్రీ బేతవోలు రామబ్రహ్మంగారు, మరియు ముఖ్య అతిథి శ్రీ వాసు ప్రకాశ్ గారల సందేశానంతరం సభముగిసింది. నృత్యకార్యక్రమానికి ప్రాయోజకతనందించిన Sri Prakash Educational Society సంచాలకులు శ్రీ వాసుప్రకాశ్ గారికి అకాడమీ ధన్యవాదాలు సమర్పించుకుంది.


తరువాత జరిగిన నృత్యకార్యక్రమంలో ప్రొ. అనురాధ జొన్నలగడ్డ గారి కొరాయోగ్రఫీలో నర్తకీమణులు శ్రావ్య సుభ్రమణ్యం, మేఘ విజయన్, G.P.గోపిక, K. శ్రీలక్ష్మి, అపర్ణ అరుణకుమార్, మహిత దేవులపల్లి మూడు నృత్యాంశాలను వరుసగా ప్రదర్శించారు.

ముందుగా చక్రవాకరాగంలో గజాననయుతం అన్న దీక్షితులవారికృతితో విఘ్నవినాశకుని దీవెనలుకోరుకొని, నారాయణతీర్థులవారి కృష్ణలీలాతరంగిణినుంచి "వీక్షేకద దేవదేవం" అంటూ రాగమాలికలో, తాళమాలికగా  కృష్ణలీలలను ప్రదర్శించి, ఖమాస్ రాగ తిల్లానాను నర్తించి ప్రేక్షకులను ఆనందపరిచారు. 

తరువాత ఆనాటి కార్యక్రమ ముఖ్యాంశం "డాన్స్ బాలే - మహాకాళి" అన్న నృత్యాంశాన్ని మొట్టమొదటిసారిగా విశాఖ ప్రేక్షకుల కోసమే సంపూర్తిగా ప్రదర్శిస్తున్నామన్న ప్రొ. అనురాధగారి మాటలకు ప్రేక్షకులు ఉప్పొంగిపోయారు. 

ప్రొ. అనురాధ జొన్నలగడ్డ, అపర్ణ అరుణ్ కుమార్, కాత్యాయని కనక్, P.B.వైష్ణవి, అనుష శ్రీనివాస్, నర్తకీమణులతోపాటు ప్రత్యేక పాత్రలలో నర్తకులు శీనయ్య బక్కి, ప్రవీణ్ వొగ్గు, చూపిన నర్తనప్రతిభ అద్వితీయం. శ్రీబసవరాజు బృందం లైటింగ్, శ్రీ సుదర్శన్ ఆహార్యం, శ్రీ D.S.V. శాస్త్రీ సంగీతం సమకూర్చగా "మంహంకాళి" నృత్యరూపకం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది.


దేవి సప్తశతి, దేవి భాగవతంనుండి ప్రేరణను తీసుకొని కాలస్వరూపమైన మహంకాళి, లోకాలలో వికృతరూపం ధరించి, స్వార్థం, ధనం, అధికారమదం, పైశాచిక తాండవంచేస్తున్నవేళ ఆయా రూపాలను సమూలంగా నాశనంచేయడానికి లోకాలనన్నింటినీ తనలో ఐక్యంచేసుకొని మరల పునః సృష్టి చేసే విధానం అరగంట కాలంలో అద్భుతంగా ప్రదర్శించగలిగారు బృందసభ్యులు. ముఖ్యంగా నర్తకులిరువురు ప్రదర్శించిన ఆసురీశక్తుల విజృంభణకు జేజేలు.


అంశం ప్రతి "ఫ్రేమ్ "లో అనురాధగారి కొరియోగ్రఫీ ప్రతిభ కనుపిస్తూనే ఉంది. పాత్రలకు తగిన అభినయాన్ని ఆయా నర్తకులచే చేయించడం విశేషం. విశిష్ట అతిథి శ్రీ బేతవోలు రామబ్రహ్మంగారు తన సమీక్షలో నృత్యం అనేది భరతముని, సిద్ధేంద్రయోగి నిర్వచించినట్లు, ఒకయోగమన్నది సత్యం. ఆయన అన్నట్లుగా వారి నృత్యం వీక్షించడానికి ప్రేక్షకులకు రెండుకళ్ళూ చాలలేదంటే అతిశయోక్తికాదు. భావానికి తగిన రూపకల్పన ఒకప్రక్క అనూరాధగారు చూపుతూండగా మరొకప్రక్క యిద్దరు నర్తకీమణులు దానికి తగినవివరణలనందించడం గొప్ప కొరియోగ్రఫీకి నిదర్శనం. రామబ్రహ్మంగారన్నట్లు ఆప్రదర్శన మేథావి వర్గంకోసం రూపకల్పన చేశారేమో అన్నంత ఉత్తమంగా నడచింది. నర్తనంలో పూర్వపు సాంప్రదాయముద్రలు చాలక కొత్తముద్రలను సందర్భోచితంగా ప్రదర్శించడం ప్రజ్ఞకు ఉదాహరణ. 

అంతకుముందు సోలో ప్రదర్మనలలో తరంగంలో "యతోదృష్టిః తతోభావః" అన్న మూలసూత్రాన్ని ప్రత్యక్షంగా దర్శింపజేశారందరూ.

కృష్ణపరమాత్మను సినిమాకృష్ణునిలాకాకుండా "సిద్ధసన్నుత చారుశీలం" అన్న నారాయణతీర్థులవారి మనస్సుని గ్రహించి కృష్ణుని నుతించడంలో కృష్ణపరబ్రహ్మగా చూపడం విశేషం. యిలా ఎన్నో విషయాలను నృత్యవిశేషాలను విశ్లేషిస్తే, విశ్లేషణ ఏరీతిలో సాగాలో తెలియజేసిన శ్రీ బేతవోలు రామబ్రహ్మంగారికి అకాడమీ ధన్యవాదాలు మరొక్కమారు తెలుపుకుంటోంది. ఆయన చేతులమీదుగా అందరికీ సన్మానం జరిపించిన తరువాత అకాడమీ ఈ వేడుకలు ముగిసినట్లు ప్రకటిస్తూ ప్రాయోజకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంది. 

ప్రతిరోజు కార్యక్రమాన్ని తన ప్రారంభపలుకులతో ఆహ్వానములతో సభానిర్వహణతో శ్రీ వి.యెస్.యెన్.మూర్తి ఆరంభించగా, శ్రీమతి Y.  లక్ష్శీప్రభ, శ్రీమతి M.K. సునీత గారలు కళాకారుల పరిచయాలను సమర్పించగా, చక్కనైన సభానంతర సమీక్షలను యథావిధిగా డా. పేరాల బాలమురళీగారు అందించి వేడుకలు సజావుగా సమయబద్ధంగా జరుగడానికి దోహదపడడం విశేషం. అధ్యక్షులు శ్రీ యస్వీ రంగరాజన్, కార్యదర్శి శ్రీ యమ్మెస్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు శ్రీ బి.ఎ.రాజారావు, డా. పేరాల బాలమురళీకృష్ణ, సహకార్యదర్శులు శ్రీ టి.కృష్ణారావు, శ్రీ అయ్యగారి భుజంగరావు, కోశాధికారి శ్రీ వీరఘంట చంద్రశేఖర్ గారలు ఎవరిపాత్రలను వారు తగినరీతిలో పోషించగా, కార్యవర్గసభ్యులు శ్రీ జ్వాలాప్రసాద్, శ్రీ M.M.ప్రభు, శ్రీ జ్యోతిస్వరూప్, శ్రీ రమేష్ తదితరులు వెన్నుదన్నుగా నిలచి శ్రమించడంతో అకాడమీ 54వ వార్షికోత్సవాలు సుసంపన్నమయ్యాయి. తన ఆరోగ్యం సహకరించకపోయినా, అకాడమీ ఛీఫ్ పాట్రన్ డా. సూరపనేని విజయకుమార్ గారు ప్రతిరోజు కార్యక్రమంలో పాల్గొనడం బహుదా ప్రశంసనీయం. ఆరురోజులపాటు వదాన్యుల ఆర్ధికసహాయంతో, కళాకారుల సహృదయతతో, హాలునిండిన ప్రేక్షకుల ప్రోత్సాహంతో, వేడుకలు ఘనంగా జరగడమేకాక రసజ్ఞుల హృదయాలలో అకాడమీకి సుస్థిరమైన స్థానాన్ని సంపిదించిపెట్టాయన్నది తిరుగులేనిసత్యం.



Tuesday 31 October 2023

 


Presenting 54th Annual Music Festival of Music and Dance
November 25, 2023 to November 30, 2023
Visakhapatnam
All Are Invited.

 విశాఖ మ్యూజిక్ అకాడమి విశాఖపట్నం 54వ వార్షిక సంగీతనృత్యోత్సవాలు విశాఖ మ్యూజిక్ అకాడమి స్థానిక కళాభారతి (ఏ.సి) ఆడిటోరియంలో 25.11.2023 నుండి ...